Women teachers day: మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రీబాయి ఫులే జయంతి
మహాత్మా జ్యోతిబా ఫులే సతీమణి, బాలికా విద్య కోసం విశేష కృషి చేసిన సావిత్రీబాయి ఫులే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏటా జనవరి 3న సావిత్రీబాయి జయంతిని రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో 50 శాతానికిపైగా మహిళా ఉపాధ్యాయులే ఉండడంతో.. వారికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సావిత్రీబాయి జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను సన్మానించాలని, పలు కార్యక్రమాలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలిచ్చారు.
ఆమె పోరాటం స్ఫూర్తిదాయకం
లింగ వివక్ష, కుల అసమానతలపై సావిత్రీబాయి ఫులే చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, ఆమె ఆశయాలను సాధించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం(3న) సావిత్రీబాయి జయంతిని పురస్కరించుకొని ఫులే దంపతుల సేవలను సీఎం స్మరించుకున్నారు. ‘‘మహిళల విద్యకు ప్రాధాన్యం కల్పించి, అణచివేతకు గురైన వర్గాలకు న్యాయం దక్కేందుకు సావిత్రీబాయి తన జీవితాన్ని అర్పించారు. ఈ నేపథ్యంలో బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రీబాయి జయంతి రోజున మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. సావిత్రీబాయి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రతి ఏడాది ఘనంగా జరుపుకోవాలి’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
తేది.03-01-2025 న ప్రాథమికోన్నత పాఠశాల బోర్గీ నందు మహిళ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళ ఉపాధ్యాయులను సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ. కిరణ్ కుమార్ గారు, ఉపాద్యాయులు శ్రీ. శంశోద్దీన్ గారు, వినయ్ కుమార్ గారు, మహిళ ఉపాధ్యాయులు శ్రీమతి. భాను ప్రియ గారు, శ్రీమతి. మహబూబా గారు పాల్గొన్నారు.
